ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్ తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఇది దేశ సాంకేతిక స్వావలంబనలో కీలక ముందడుగుకు గుర్తుగా నిలుస్తుందని పేర్కొన్నారు. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎల్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులు, మేడిన్ ఇండియా చిప్ గురించి ప్రస్తావించారు. సెమీ కండక్టర్ల విషయంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం చర్యల్ని వేగవంతం చేస్తోంది. ఇటీవల భారత దేశం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.13,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం 234 విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులకు తాజా సెమీకండక్టర్ డిజైన్ సాధనాలను అందిస్తున్నామని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 పూర్తి చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. అయితే మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబ్ ఆధునీకరణ ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నా ఆయన.. ఇది పూర్తయ్యాక ISM 2.0 కోసం పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మానుఫాక్చరింగ్ కార్ప్‌తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్‌లోని దొలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నిర్మిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. వీటిలో ఉపయోగించే గాలియం నైట్రైడ్ పరిశోధన, అభివృద్ధి కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కి ప్రభుత్వం రూ.334 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం త్వరలో విడిభాగాల కోసం ఉత్పత్తి- సంబంధిత ప్రోత్సాహక పథకం తీసుకొస్తుందని ఆయన అన్నారు. 2025 సెప్టెంబర్- అక్టోబర్ నాటికి తొలి మేడిన్ ఇండియా చిప్ విడుదల కానుందని తెలిపారు.
ఈ ఏడాదిలోనే తొలి మేడిన్ ఇండియా చిప్ : అశ్వినీ వైష్ణవ్
February 16, 2025
0
Tags