న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకోవడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. రైల్వేశాఖ నిర్లక్ష్యంతోనే అది చోటుచేసుకుందని విమర్శించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తొక్కిసలాట ఘటన తనను ఎంతో బాధించిందని రాహుల్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన రైల్వేశాఖ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. 'ఇది తీవ్ర విషాదకరం. అక్కడి నుంచి వచ్చిన విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. కేంద్రం పర్యవేక్షణలో, దేశ రాజధానిలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతే. మరణించిన, గాయపడినవారి ఖచ్చితమైన గణాంకాలు ఎప్పుడు తెలుస్తాయి?. రద్దీ నియంత్రణకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కుంభమేళా నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఎందుకు నడపలేదు?' అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే సైతం ఇలాంటి ఆరోపణలు చేశారు. కుంభమేళాకు వెళ్లేందుకు ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు పోటెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 18 మంది మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు 12, 13, 14 ఫ్లాట్‌ఫాంలపై వేచిఉన్నారు. అదే సమయంలో 14వ నంబరుపై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలవడం ఒక్కసారిగా తొక్కిసలాటకు దారితీసింది. దీనిపై ఢిల్లీ పోలీసులు అధికారికంగా విచారణ చేస్తున్నారు. తొక్కిసలాటకు గల కారణాలు తెలుసుకునేందుకు రైల్వేస్టేషన్‌లోని సీసీటీవీలను పరిశీలిస్తునట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట : రాహుల్ గాంధీ
February 16, 2025
0
Tags