తన దేశాన్ని రక్షించేవాడు ఎటువంటి చర్యలు తీసుకున్నా చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదు !

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో సంస్కరణల జోరును పెంచిన విషయం తెలిసిందే. నిత్యం పదుల సంఖ్యలో కార్యనిర్వాహక ఉత్తర్వుల (ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌)పై సంతకాలు చేస్తున్నారు. వీటిల్లో అక్రమ వలసలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు, ట్రాన్స్‌జెండర్లు యూఎస్‌ సైన్యంలో పనిచేయకుండా నిషేధం, ప్రభుత్వ నియామకాలపై బ్యాన్‌, క్యాపిటల్‌ హిల్‌పై దాడిచేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, ప్రపంచ కుబేరుడు మస్క్‌ నేతృత్వం వహిస్తున్న డోజ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పడం, ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌ను మార్చే ప్రయత్నాలు, జన్మతః వచ్చే పౌరసత్వం రద్దు వంటి విషయాలపై పలు వ్యాజ్యాలను ఎదుర్కొంటున్నారు. యూఎస్‌ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన సొంత సోషల్‌ మీడియా ట్రూత్‌ వేదికగా ట్రంప్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ''తన దేశాన్ని రక్షించేవాడు ఎటువంటి చర్యలు తీసుకున్నా..అది చట్టాల్ని ఉల్లంఘించినట్లు కాదు'' అని ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్  వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ పోస్టుతో ఆయన తన చర్యలను సమర్థించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఫ్రాన్స్‌ను నెపోలియన్ పరిపాలిస్తున్న సమయంలో..ఆయన తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ తరచూ ఈ వ్యాఖ్యలు చేసేవారు. ట్రంప్‌నకు బద్ధవిరోధి అయిన కాలిఫోర్నియా సెనేటర్ ఆడమ్ షిఫ్ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు 'నిజమైన నియంతలా మాట్లాడారు' అని అభివర్ణించారు. అంతర్జాతీయ కార్యక్రమాలకు యూఎస్‌ ఎయిడ్‌ సంస్థ ద్వారా అందుతున్న నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఆదేశాలపై ఫెడరల్‌ జడ్జి అమీర్‌ అలీ తాజాగా తాత్కాలికంగా స్టే ఇచ్చారు. తన ఉత్తర్వును అమలు చేస్తున్నదీ లేనిదీ అయిదు రోజుల్లో తెలపాలని ట్రంప్‌ సర్కారును ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)