ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటు 8.25%

Telugu Lo Computer
0


2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు నే కొనసాగించాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో శుక్రవారం జరిగిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ 237వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఈడీఎల్‌ఐకి సంబంధించిన పలు సవరణలకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి తెలిసిందే. సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 7 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈపీఎఫ్‌ సభ్యులు సర్వీసులో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈడీఎల్‌ఐ కింద జీవిత బీమా సదుపాయాలు అందుతున్నాయి. సర్వీసు ఆధారంగా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తోంది. అయితే, చందాదారులు కనీసం ఏడాది సర్వీసు పూర్తిచేయకుండా మరణిస్తే బీమా సహాయం రూ.11 వేల నుంచి రూ.13వేలలోపు మాత్రమే ఉంటోంది. ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా రూ.50వేలు చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు. అనారోగ్యం, ప్రమాదం, ఇతర కారణాలతో ఈపీఎఫ్‌ చందా చెల్లించని రోజులు నెల కన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించట్లేదు. ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన ఆరునెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీసు కాలం ప్రకారం సొమ్ము లభిస్తుంది. దీనివల్ల ఏటా 14వేల కేసులకు ప్రయోజనం లభిస్తుంది. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినపుడు ఈపీఎఫ్‌ సర్వీసుకు ఒక్కరోజు విఘాతం కలిగినా ఈడీఎల్‌ఐ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని ఇవ్వడం లేదు. ఇకపై రెండు నెలలు వ్యవధి వచ్చినా సర్వీసులో కొనసాగుతున్నట్లు భావించి కనీస బీమా రూ.2.5 లక్షలు అందించాలని ట్రస్టీల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)