తెలంగాణ ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన బొప్పూరి ఆనంద్‌కుమార్ బెదిరింపుల వ్యవహారం శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ అభ్యర్థులకు ఐటీ ఆధారిత శిక్షణ ఇచ్చినందుకు చైతన్యపురిలోని ఓ స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీకి మంజూరైన బిల్లులో 4 శాతం వాటా ఇవ్వాల్సిందేనని ఆయన చేసిన బెదిరింపులకు సంబంధించిన సాంకేతిక ఆధారాలపై ఏసీబీ ప్రాథమిక సమాచారం సేకరించింది. దీని ప్రకారం సాధారణంగా అర్హులైన ఎస్సీ అభ్యర్థులకు 70-90 రోజులపాటు శిక్షణ ఇచ్చే బాధ్యతను స్కిల్ డెవలప్‌మెంట్ అకాడమీలకు కార్పొరేషన్ అప్పగిస్తుంది. నెల రోజుల శిక్షణ పూర్తయిన తర్వాత 40 శాతం, శిక్షణ ముగిశాక మరో 30 శాతం, శిక్షణార్థుల ప్లేస్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యాక మిగిలిన 30 శాతం బిల్లుల్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చైతన్యపురిలోని అకాడమీకి కార్పొరేషన్ ఎండీ గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు రూ.33,32,350 మంజూరు చేశారు. ఆ సొమ్ము ఈ నెల 3న అకాడమీ బ్యాంకు ఖాతాలో జమైంది. తనకు కాల్ చేయాలంటూ ఈ నెల 11న అకాడమీ నిర్వాహకుడి వాట్సప్ నంబర్‌కు ఆనంద్‌కుమార్ మెసేజ్ పంపారు. గతంలో లంచం కోసం ఆనంద్‌కుమార్ నుంచి వేధింపులు ఎదురవడంతో మళ్లీ అదే ఉద్దేశంతో చేశారనే అనుమానంతో ఈసారి బాధితుడు స్పందించలేదు. మరుసటి రోజు అనంద్‌కుమార్ వాట్సప్ కాల్ చేసి బిల్లులో 4 శాతం వాటా కింద తనకు రూ.1.33 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. తనకు తెలిసిన ఓ మతప్రబోధకుడి ఫోన్ నంబరు పంపించి దానికి జీపే చేయాలని సూచించారు. జీపే చేశాక ఆ స్క్రీన్‌షాట్లను తనకు పంపించాలన్నారు. ఈ వాట్సప్ కాల్‌ని బాధితుడు మరో ఫోన్ ద్వారా రికార్డు చేశారు. ఈ నెల 13న తన ఫోన్ నంబరు నుంచి వాయిస్ కాల్ చేసిన ఆనందకుమార్.. తాను సూచించిన ఖాతాకు డబ్బులను బదిలీ చేశారా అని వాకబు చేశారు. గుర్తుతెలియని నంబరుకు తాను పంపించబోనని.. రెండు రోజుల్లో స్వయంగా కలిసి ఇస్తానని బాధితుడు చెప్పాడు. అందుకు ఆనంద్‌కుమార్ అంగీకరించారు. ఈ సంభాషణనూ బాధితుడు రికార్డు చేశాడు. కార్పొరేషన్ కార్యాలయంలో ఈ నెల 17న జరిగిన కొత్త టెండర్ ప్రీ-బిడ్ మీటింగ్‌కు బాధితుడు హాజరయ్యారు. తనకు ఇంకా లంచం ఇవ్వలేదంటూ ఆయనపై ఆనంద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగిన సొమ్ము ఇవ్వకపోతే కొత్త టెండర్‌లో ఇబ్బందులు సృష్టిస్తానని హెచ్చరించారు. దీంతో బాధితుడు ఈ నెల 18న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సంభాషణల వివరాలను అందజేశాడు. ఈ నెల 20న రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఆనంద్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మంజూరైన బిల్లులో 4 శాతం వాటా ఇవ్వాల్సిందేనని ఆనంద్‌కుమార్ బెదిరింపులు !
February 26, 2025
0
Tags