తెలంగాణాలో ఎల్‌-2 లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు ?

Telugu Lo Computer
0


తెలంగాణాలో గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని రెండు పడక గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్‌-2 జాబితాలోని వారికి ఇవ్వడానికి  ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకుని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3గా విభజించింది. ఎల్‌-1లో సొంత స్థలం ఉన్న 21.93 లక్షల మందిని చేర్చారు. వీరందరికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షల చొప్పున అందించనుంది. ఎల్‌-2లో సొంత స్థలాలు లేని 19.96 లక్షల మంది ఉన్నారు. వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన రూ.5 లక్షల చొప్పున ఇవ్వనుంది. అయితే వీరిలోనే కొందరికి మిగిలిపోయిన రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది. ఎల్‌-3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారున్నారు. వారికి మిగిలినవి కేటాయించాలని ఇవ్వాలనుకుంటుంది. గత ప్రభుత్వం పదేళ్లలో 2.36 లక్షల రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. వీటిలోనూ 1.36 లక్షలనే పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉన్నాయి. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి గుత్తేదారులతో హౌసింగ్‌ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. చాలామంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. వారు మళ్లీ ముందుకొస్తే ఇసుకతోపాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని భావిస్తోంది. ఎల్‌-2లో పెద్దఎత్తున దరఖాస్తుదారులు ఉండడంతో ఈ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన, పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది. అక్కడక్కడ రెండు పడక గదుల ఇళ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపు చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికే కేటాయించి, మిగతా ఇళ్లను ఎల్‌-2 జాబితాలోని వారికి ఇవ్వనున్నారు. స్థలం, రూ.5 లక్షలు తీసుకోవడం కంటే.. నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామసభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)