సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ !

Telugu Lo Computer
0


సింగపూర్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్‌తో భేటీ అయ్యారు. గ్రీన్‌ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ భేటీలో పాల్గొన్నారు. గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి బృందం ఢిల్లీ నుంచి బయలుదేరి సింగపూర్‌ వెళ్లింది. శుక్రవారం ఉదయం వివియన్‌ బాలకృష్ణన్‌తో వారు భేటీ అయ్యారు. ఆ దేశంలోని అభివృద్ధి పనులతో పాటు తెలంగాణలోని ప్రణాళికలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, దానికున్న అవకాశాలపై చర్చ జరిపారు. సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో జరుగుతున్న అంశాలను పోల్చి చూశారు. నిధుల సమీకరణ గురించి సమాలోచనలు చేశారు. రాష్ట్ర బృందం శని, ఆదివారాల్లో కూడా సింగపూర్‌లో పర్యటించనుంది. చాంగి నగరంలో సింగపూర్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఉంది. రాష్ట్రంలో కూడా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో ఆ దేశంలోని కోర్సులు, ప్రణాళికలు, నిర్వహణ విధానంపై అధ్యయనం చేయనున్నారు. వీటిపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. సింగపూర్‌లోని పారిశ్రామిక వేత్తలు, ప్రవాస భారతీయులతో కూడా సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటన అనంతరం రాష్ట్ర బృందం దావోస్‌ వెళ్లనుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొననుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఈ వేదికపై వివరించనున్నారు. గతంలో సుమారు రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన నేపథ్యంలో.. ఈసారి మరింత ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా ఫోకస్‌ చేయడంతో పాటు కొత్తగా తెచ్చిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీని వివరించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)