సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ 'ఉనికి' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ ' సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆత్మకథ 'ఉనికి' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ' పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు గవర్నర్లు బండారు దత్తాత్రేయ, హరిబాబు, కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ లక్ష్మణ్, రచయిత అందెశ్రీ, బీఆర్ఎస్ నేత బోయిన్ పల్లివినోద్ తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని అన్నారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని చెప్పారు. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల గురించి అందరికీ తెలుసని, గోదావరి జలాల సద్వినియోగం కోసం విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. ప్రస్తుతం ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారని, వారితో మాట్లాడి భూసేకరణ సహకరించాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయమని, తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైనే ధ్యాస ఉంటుందన్నారు సీఎం రేవంత్. ప్రతిపక్షం, పాలకపక్షం కలిస్తేనే ప్రభుత్వమని అన్నారు. సభలో పాలక పక్ష నేతకు ఎంత ప్రాధాన్యం ఉండేదో ప్రతిపక్ష నేతకూ అంతే ప్రాధాన్యత ఉండేదని.. అయితే, కాలక్రమేణా స్ఫూర్తిని కోల్పోయామని అన్నారు. సభలో తాము ఇప్పటి వరకు ఒక ప్రతిపక్ష సభ్యుడ్ని కూడా సస్పెండ్ చేయలేదన్నారు. తెలంగాణ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి నిరంతరం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మెట్రో, రీజనల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణాల విషయాలపై కేంద్రం సహకరించాలని ప్రధానమంత్రి మోడీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి త్వరగా పరిపూర్ణమవుతుంది. హైదరాబాద్‌ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బండి సంజయ్ ఇందు కోసం తనవంతుగా కృషి చేయాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్, హైదరాబాద్ మెట్రో పొడిగించాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోడీ మంజూరు చేశారు. పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఏకతాటిగా కలిసి పోరాడుతున్నాయి. మనం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా, సందర్భానుసారం పార్టీల ఐక్యతను అన్ని పార్టీల నాయకులు ప్రశంసించారు. అనేక పనులు ఉన్నప్పటికీ పుస్తకావిష్కరణకు వచ్చి సమయం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డిని కొనియాడారు. తన ఆత్మకథ 'ఉనిక' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, జాతీయ భావన ఉంటుందని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా భారతీయతను వదులుకోకూడదని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధమతంలో చేరారని చెప్పారు. శ్రీపాద రావు అప్పట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశారని, అందుకే ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బీజేపీ తీర్మానం చేసిందని  మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు గుర్తు చేశారు. రథయాత్ర సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్నారని అద్వానీని సీనియర్‌ ఎన్టీఆర్‌ మెచ్చుకున్నారని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ తన సినిమాల్లో బీసీ వాదాన్ని చక్కగా తెరకెక్కించారన్నారు. ఇంకా మన దేశంలో ఐదో వంతు పేదరికం ఉందని, దానికి పరిష్కారం చూపాలని అన్నారు. దేశ యువతలోని శ్రమ శక్తిని బయటకు తీయడమే ఇప్పటి నాయకులకు అసలైన సవాల్‌గా మారిందన్నారు. వారిని ప్రోత్సహించకపోతే గంజాయి, డ్రగ్స్‌ వంటి దురలవాట్లకు లోనవుతారన్నారు. ఇక, సీఎం రేవంత్‌ రెడ్డి 'హైడ్రా' ఆలోచన మంచిదని విద్యాసాగర్ రావు కొనియాడారు. గిరిజన ప్రాంతాల్లో రూ. వేల కోట్ల విలువైన సంపద ఉందని, దాన్ని వెలికి తీసి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. హైడ్రా తరహాలో గిరిజనుల భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యాసాగర్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)