'ద జో రోగన్ ఎక్స్‌పీరియన్స్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా లోని జోబైడెన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ''బైడెన్ ప్రభుత్వం కొవిడ్ టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పుడు కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ దుష్ఫ్రభావాల గురించి పోస్టులు తీసేయాలని ఒత్తిడి చేసిందన్నారు. వ్యక్తిగతంగా నేను టీకాలకు అనుకూలంగా ఉంటాను. వాటివల్ల ప్రతికూలత కంటే సానుకూల ఫలితాలే ఉంటాయి. అయితే కొవిడ్ టీకాలను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ వాటి గురించి వినిపించిన వాదనలను సెన్సార్ చేయడానికి ప్రయత్నించారని నాకు అనిపించింది. వ్యాక్సిన్‌లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పే పోస్టులన్నీ తీసేయాలని, తన సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరంగా పరిగణించిన కంటెంట్‌ను సెన్సార్ చేయాలని వైట్‌హౌస్ సిబ్బంది నుంచి ఒత్తిడి వచ్చింది. అందంతా హాస్యాస్పదంగా ఉండటమే కాక, అలా చేయకూడదని నాకు అనిపించేది'' అని జుకర్‌బర్గ్ తెలిపారు. టైటానిక్ నటుడు లియోనార్డో డికాప్రియోపై వచ్చిన మీమ్ కూడా వారు తీసేయమన్న పోస్టుల్లో ఒకటని పేర్కొన్నారు. వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలతో కొన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు పరిహారం పొందుతారేమో అన్నట్టుగా ఉన్న ఆ మీమ్ వైరల్ అయింది. ఇదిలాఉంటే నకిలీ, హానికార సమాచార వ్యాప్తి కట్టడి కోసం అనుసరిస్తోన్న సెన్సార్‌షిప్ విధానాల్లో మెటా మార్పులు చేసినట్లు ఇటీవల జుకర్‌బర్గ్ ప్రకటించారు. ''సెన్సార్‌షిప్ అధిక స్థాయిలో ఉన్న పరిస్థితికి చేరుకున్నాం. ప్రస్తుతం మేం మా తప్పులను తగ్గించుకోవడంపై దృష్టిపెడతాం. మా విధానాలను సరళీకరించి, మా ప్లాట్‌ఫాంలలో స్వేచ్ఛ, భావవ్యక్తీకరణను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటాం'' అని జుకర్‌బర్గ్ ఓ వీడియో విడుదల చేశారు. జుకర్‌బర్గ్ ప్రకటన వెలువడగానే ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే.
కొవిడ్ సమయంలో వ్యాక్సిన్ దుష్ఫ్రభావాల పోస్టులు తీసేయాలని బైడెన్ ప్రభుత్వం ఒత్తిడి !
January 11, 2025
0
Tags