అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా ఎంపిక చేసిన తులసీ గబ్బార్డ్ మాట్లాడుతూ నియంతలపై తనకు ఎలాంటి ప్రేమ లేదని అన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టబోయే ముందు తులసి యూఎస్ సెనేటర్ల ఎదుట హాజరయ్యారు. డెమోక్రట్లు, రిపబ్లికన్ల నుంచి ఎదురైన ఎన్నో కఠిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ఇందులోభాగంగా మాట్లాడుతూ అసద్, గడాఫీ, మరే ఏ ఇతర నియంతల పైనా తనకు ప్రేమ లేదని, అల్‌ఖైదాను ద్వేషిస్తానని వెల్లడించారు. అసద్ తన సొంత ప్రజల పైనే రసాయన ఆయుధాలను వినియోగించిన ఘటనను తులసి ఖండించారు. ఉగ్రవాదాన్ని, దానిని ప్రోత్సహించే నేతలను తాను ఏమాత్రం ఉపేక్షించనని పేర్కొన్నారు. డీఎన్‌ఐ డైరెక్టర్‌గా అమెరికా ప్రజల భద్రత, స్వేచ్ఛను కాపాడడానికి, సైన్యాన్ని మరింత పటిష్ఠం చేయడానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. అమెరికాలోని మొత్తం 18 నిఘా సంస్థలు డీఎన్‌ఐ హోదాలో ఉన్న తులసి పర్యవేక్షణలో పనిచేస్తాయి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా ఇవి సేకరిస్తాయి. చివరికి సీఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్టు చేస్తారు. నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక విషయాలను ఆమె అధ్యక్షుడికి వెల్లడిస్తారు. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పాటుచేసిన అత్యంత కీలక పదవి ఇది. 2019లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడ్డారు. కానీ, ఆ తర్వాత బైడెన్‌కు మద్దతు పలికారు. నాడు హిల్లరీ క్లింటన్ ఆమెను ఏకంగా రష్యా ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పించారు. దీనికి తులసి స్పందిస్తూ యుద్ధోన్మాదుల అవినీతి స్వరూపంగా హిల్లరీని అభివర్ణించడం సంచలనం రేపింది. 2024 పోలింగ్‌కు కొన్ని వారాల ముందు రిపబ్లికన్ పార్టీలో చేరారు. యుద్ధాలను వ్యతిరేకించే ట్రంప్ వైఖరి తన భావాలకు దగ్గరగా ఉండటంతో చేరినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడుగా రిపబ్లికన్ల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కమలతో చర్చా కార్యక్రమంలో ట్రంప్‌నకు చేదోడువాదోడుగా వ్యవహరించారు. తనపై దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ట్రంప్ బలంగా విశ్వసించారు. అందుకే తులసికి ఆ విభాగాన్ని అప్పజెప్పారు.
నియంతలపై నాకు ప్రేమ లేదు : తులసీ గబ్బార్డ్
January 31, 2025
0
Tags