ఉత్తర కొరియా సైనికులను బందీలుగా పట్టుకున్న ఉక్రెయిన్‌ !

Telugu Lo Computer
0


రష్యా తరఫున ఉక్రెయిన్‌లో పోరాడుతున్న ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను తాము అదుపులోకి తీసుకున్నామని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యాలో బందీగా ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే ఉత్తర కొరియా సైనికులను వారి అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు అప్పగిస్తామని ఆయన అన్నారు. ''రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను అదుపులోకి తీసుకున్నాం. ఆ దేశానికి చెందిన మరి కొందరు సైనికులను పట్టుకోవడానికి మా దళాలు ప్రయత్నిస్తున్నాయి. రష్యా వద్ద బందీలుగా ఉన్న మా వారిని విడుదల చేస్తేనే వీరిని ఉత్తర కొరియాకు అప్పగిస్తాం'' అని జెలెన్‌స్కీ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. వారికి సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేశారు. పట్టుబడిన సైనికుల గురించి ఉక్రెయిన్‌ భద్రతా సర్వీస్‌ ఎస్‌బీయూ అధికారులు మాట్లాడుతూ.. ఒక సైనికుడు దగ్గర ఎలాంటి ధ్రువపత్రం లేదని, మరో సైనికుడి దగ్గర రష్యా మిలిటరీ కార్డు ఉందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మద్దతుగా దాదాపు 10 వేల మంది ఉత్తర కొరియా సైనికులు రంగంలోకి దిగారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తూ వచ్చింది. కానీ దీనిపై మాస్కో మాత్రం ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. రష్యా సైన్యానికి మద్దతుగా పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికులు కూడా భారీగా చనిపోయినట్లు ఇప్పటికే జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే అందులో వారి పేర్లు, వివరాలను మార్చేసి రష్యాకు చెందిన వారిగా తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఉత్తర కొరియా సైనికులను సజీవంగా పట్టుకోవడం అంత సులభం కాదని జెలెన్‌స్కీ అన్నారు. యుద్ధంలో వారి పాత్ర బయటపడకూడదనే ఉద్దేశంతో గాయపడిన ఆ దేశ సైనికులు తమకు చిక్కకుండా ఉండేందుకు రష్యా వారిని కాల్చి చంపేస్తోందని ఆరోపించారు. వారు తప్పుడు గుర్తింపు కార్డులతో రష్యా సైనికుల తరహా దుస్తుల్ని ధరించి పనిచేస్తున్నారని, చూడడానికి మాస్కో దళాల మాదిరిగానే కనిపిస్తున్నారని ఉక్రెయిన్‌ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గత సంభాషణల్ని రహస్యంగా విన్నప్పుడు వారు ఉత్తర కొరియా యాసలో మాట్లాడుతున్నట్లు బయటపడిందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)