తెలంగాణలో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రైతులకు అవసరమైన 20 రకాల సాగు సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పరికరాలకు కొంత మొత్తం సబ్సిడీ కూడా ఇవ్వనుంది. ఇందులో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పురుగు మందులు పిచికారీకి డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు వంటి పరికరాలు ఉంటాయి. ఈ పరికరాలను సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం చేసేందుకు వ్యవసాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు గడువు ఫిబ్రవరి 7, 2025గా నిర్ణయించారు. 8వ తేదీన బిడ్‌లను తెరిచి, తక్కువ కోట్ చేసిన వాటిని ఎంపిక చేయనున్నారు. సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న యంత్ర పరికరాల కోసం రూ.50 నుండి రూ.60 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించారు, కానీ అది ఆశించిన స్థాయిలో అమలుకు రాలేదు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించింది. సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న పరికరాల్లో 600 ట్రాక్టర్లు, 160 డ్రోన్లు ఉన్నాయి. దుక్కి పనులు చేయడానికి ట్రాక్టర్లకు కల్టివేటర్, ప్లవ్, రోటవేటర్లు వంటి పరికరాలు కూడా అందజేయనున్నారు. టెండర్లలో వెల్లడించిన వివరాల ప్రకారం, 12,000 యూనిట్ల రోటావేటర్లు, 4,000 యూనిట్ల కల్టివేటర్లు, 2,000 యూనిట్ల ప్లవ్, 200 యూనిట్ల గడ్డికట్టే యంత్రాలు, 400 బ్రష్ కట్టర్లు, 64 బండ్ ఫోర్మర్లు, 200 పవర్ వీడర్స్ వంటి పరికరాలు రైతులకు అందించబడతాయి. మొక్కజొన్న కంకుల నుంచి గింజలు వేరుచేసే 80 యంత్రాలు, 420 పవర్ ట్రిల్లర్లు, 16-20 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో 12,000 పవర్ స్ప్రేయర్లు, 12-16 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో 6,300 స్ప్రేయర్లు, డీజిల్ మరియు కరెంటుతో నడిచే 1,230 యూనిట్ల పంప్ సెట్లు, 1,40,000 PVC మరియు HDPE పైపులు, 50 స్టోరేజీ బిన్స్ అందించనున్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ యాంత్రీకరణ పథకంతో వ్యవసాయ రంగంలో మరింత పురోగతి సాధించవచ్చని ఆశిస్తున్నారు.
తెలంగాణలో సబ్సిడీపై రైతులకు అందజేయనున్న ట్రాక్టర్లు, డ్రోన్లు !
January 29, 2025
0
Tags