కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఇదంతా భాజపా కుట్రేనని ఆప్‌ ఆరోపించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అదే సమయంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. ''భాజపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీ ఆందోళనకు గురవుతోంది. అందుకే కేజ్రీవాల్‌ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయన ప్రచారం చేస్తుండగా భాజపాకు చెందిన కొందరు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు. కానీ, ఈ చర్యలకు ఆప్‌ భయపడదు. ఎన్నికల్లో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెబుతారు'' అని 'ఎక్స్‌' (ట్విటర్‌) వేదికగా ఆప్‌ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది. ఈ సంఘటనపై భాజపా స్పందించింది. ఆప్‌ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ''కేజ్రీవాల్‌ కాన్వాయ్‌ ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. వీరిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ముందున్న ఓటమిని గురించి ఆలోచిస్తూ.. ప్రజల ప్రాణాలకున్న విలువను ఆయన మరచిపోయారు. బాధితులను కలిసేందుకు ఆస్పత్రికి వెళుతున్నా'' అని భాజపా నేత పర్వేశ్‌ వర్మ పోస్టు పెట్టారు. ఈ ఎన్నికలల్లో మూడో సారి అధికారం సాధించేందుకు ఆప్‌ ప్రయత్నిస్తుండగా.. ఈ సారి ఎలాగైన ఆప్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్‌, భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రచారం వేళ కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)