మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళగిరిలోని ఆటోనగర్‌లో మెగా హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ, హస్తకళల శాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హస్తకళల శాఖ మంత్రి వంగలపూడి సునిత తాజా పరిశీలనలో పాల్గొని పార్కు నిర్మాణానికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పార్కును మొత్తం 10.80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అధికారులతో కలిసి మంత్రి సునిత ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. నేతన్నలు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడానికి, అమ్మకాలు నిర్వహించడానికి.. శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ పార్క్ విశేషంగా ఉపయోగపడనుంది. ప్రభుత్వం తమిళనాడులోని కాంచీపురం తరహాలో హ్యాండ్లూమ్ పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక సదుపాయాలతో నేతన్నలకు నిరంతర ఉపాధిని అందించే విధంగా నిర్మాణ ప్రణాళికలు రూపొందించాయి. దేశవ్యాప్తంగా పేరుగాంచిన నేత వస్త్రాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రదర్శన హాళ్లు, మార్కెటింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంవత్సరం పొడవునా 365 రోజులూ నేతన్నలకు పని దొరికేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గతంలో వర్షాకాలం, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉండేది. అయితే.. ఈ మెగా పార్క్ ద్వారా ఏడాది మొత్తం ఉపాధి లభించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నూతన మెగా హ్యాండ్లూమ్ పార్క్ ద్వారా అధునాతన మౌలిక సదుపాయాలతో.. మార్కెట్ లింకుల ద్వారా నేతన్నల ఆదాయాన్ని పెంచడం, యువతను ఈ రంగం వైపు ఆకర్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే.. రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లో కూడా ఇలాంటి పార్కులను ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఈ మెగా హ్యాండ్లూమ్ పార్క్ ద్వారా స్వదేశీ చేనేత, హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించేందుకు నూతన మార్కెటింగ్ విధానాలను అమలు చేయనుంది. ఈ-కామర్స్, ఎగుమతుల అవకాశాలు అందుబాటులోకి తెచ్చి, హ్యాండ్లూమ్ వస్త్రాలకు ప్రపంచ మార్కెట్‌లో విస్తృతంగా వ్యాప్తి కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)