అమెరికా స్టాక్ మార్కెట్‌ను షేక్ చేసిన డీప్‌సీక్ స్టార్టప్ కంపెనీ పనితీరుపై టెక్ దిగ్గజాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న 'డీప్‌సీక్' పరిమితి వనరులతోనే రూపొందగా, దీని విజయం వెనక ఉన్నది ప్రతిభావంతమైన యువ ఆవిష్కర్తలే కావడం విశేషం. డీప్‌సీక్ రూపకర్తల బృందంలో లువో ఫులి ఒకరు. చైనాలో ఏఐ జీనియస్‌గా పేరుగాంచిన ఆమె, కృత్రిమమేధ పరిశోధకురాలిగా కొనసాగుతున్నారు. డీప్‌సీక్‌లో కీలకమైన నేచురల్ లాంగ్వేజీ ప్రాసెసింగ్ రూపొందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. బీజింగ్ యూనివర్సిటీలో అభ్యసించిన లువో, కంప్యూటర్ సైన్స్ విభాగంలో చేరారు. తొలుత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ చివరకు అందులోనే రాణించారు. అనంతరం పెకింగ్ యూనివర్సిటీలో కంప్యుటేషనల్ లింగ్విస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్న ఆమె, 2019లో జరిగిన ఏసీఎల్ కాన్ఫరెన్స్‌లో ఎనిమిది పరిశోధక పత్రాలను ప్రచురించి తన సత్తా చాటారు. ఈ అద్భుత విజయంతో అలీబాబా, షియామీ వంటి టెక్ దిగ్గజాల దృష్టిలో పడిన లువో, అనంతరం ఆయా కంపెనీలతో కలిసి పనిచేశారు. అలీబాబాకు చెందిన డామో అకాడమీలో పరిశోధకురాలిగా చేరారు. అక్కడ మల్టీలింగ్వల్ ప్రీ ట్రైనింగ్ మోడల్ అభివృద్ధికి సారథ్యం వహించడంతోపాటు ఓపెన్‌సోర్స్ అలైస్‌మైండ్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే 2022లో డీప్‌సీక్‌లో లువో చేరారు. నేచురల్ లాంగ్వేజీ ప్రాసెసింగ్‌లో ఆమెకున్న నైపుణ్యాలు డీప్‌సీక్-వీ2 రూపకల్పనలో ఎంతో దోహదం చేశాయి. చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడల్‌లకు సవాల్ విసురుతుండటంతో ఆసక్తిగా మారింది. లువో అద్భుత ప్రతిభను గుర్తించిన షియామీ ఫౌండర్ లీ జున్.. సుమారు రూ.11కోట్ల ప్యాకేజీని ఆఫర్ చేయడం గమనార్హం. అయినప్పటికీ డీప్‌సీక్‌లోనే కొనసాగుతున్న ఆమె టెక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారు.
డీప్‌సీక్ విజయం వెనక 'జీనియస్' లువో ఫులి !
January 29, 2025
0
Tags