గ్రే మార్కెట్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సిద్ధమవుతోంది. ఐపీఓలో షేర్లు అలాటైన మదుపర్లు లిస్టింగ్‌కు ముందే వాటిని విక్రయించే మెకానిజాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. తద్వారా గ్రే మార్కెట్ కార్యకలాపాలు నియంత్రించాలనుకుంటున్నట్లు సెబీ ఛైర్‌పర్సన్ మాధభి పురీ బచ్ పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో తొలి పబ్లిక్ ఇష్యూల బూమ్ నడుస్తోంది. కొన్ని కంపెనీలు భారీగా సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంటున్నాయి. మదుపర్లకు లిస్టింగ్ రోజు భారీ లాభాలను కూడా అందిస్తున్నాయి. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ పూర్తయ్యాక షేర్లు.. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేర్లు లిస్టు అవ్వడానికి మధ్య మూడు రోజుల సమయం ఉంటోంది. ఈ వ్యవధిలో గ్రే మార్కెట్ కార్యకలాపాలు పెద్దఎత్తున జరుగుతుంటాయి. వీటిపై నియంత్రణ ఉండదు. గ్రే మార్కెట్ ప్రీమియం ఆధారంగా లిస్టింగ్ రోజు లాభాలను కూడా అంచనా వేస్తుంటారు. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్ ప్రీ ట్రేడింగ్ అంశాన్ని ప్రస్తావించారు. ఇన్వెస్టర్లు షేర్లు విక్రయించాలని అనుకున్నప్పుడు నియంత్రిత మార్కెట్‌కు లోబడి వారికెందుకు ఆ అవకాశం ఇవ్వకూడదు? అని సెబీ చీఫ్ అన్నారు. లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్‌లో జరుగుతున్న కార్యకలాపాలు సరికాదన్నారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు. ''ఒకవేళ మీకు షేర్లు అలాటై, వాటిని అమ్మాలి అనుకుంటే.. వ్యవస్థీకృత మార్కెట్‌లోనే వాటిని ఎందుకు అమ్మకూడదు? 'వెన్ లిస్టెడ్'గా వ్యవహరించే ఈ ప్రీట్రేడింగ్ విధానం తీసుకొచ్చేందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలతో ప్రస్తుతం సంప్రదింపులు కొనసాగుతున్నాయి'' అని సెబీ చీఫ్ మాధవి పురీ బచ్ తెలిపారు.
గ్రే మార్కెట్‌కు సెబీ చెక్ ?
January 21, 2025
0
Tags