ఇన్ఫోసిస్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.6,806 కోట్ల ఏకీకృత నికర లాభాలను అర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,106 కోట్లతో పోలిస్తే 11.46 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది డిసెంబర్ ముగిసే సమయానికి కంపెనీ ఆదాయం రూ.38,821 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాలను సైతం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 4.5- 5 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. '' బలహీనమైన త్రైమాసికంలో బలమైన రాబడి నమోదు చేశాం. మా వ్యూహాత్మక చర్యల విజయానికి ఇది ప్రతిబింబం. ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా జెనరేటీవ్ ఏఐ పై దృష్టి సారించాం. ఇదే మా క్లయింట్ పెరుగుదలకు నిదర్శనం'' అని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 5,591 మందిని నియమించుకున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,23,379కి చేరిందని పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.52 శాతం క్షీణించి రూ.1920.05 వద్ద ముగిసింది.
డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 5,591 మందిని నియమించుకున్న ఇన్ఫోసిస్ !
January 16, 2025
0
Tags