ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్‌, డీజీపీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఢిల్లీ చేరుకున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వారిని వివరణ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ వచ్చిన వారిద్దరూ ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీఐ ముందు హాజరుకానున్నారు. ఏపీలో పోలింగ్‌ రోజు, అనంతరం చోటు చేసుకున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు సీఎస్‌, డీజీపీపై మండిపడింది. దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావులేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఎన్నికల అనంతర హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది? హింసాకాండ జరుగుతుందని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అది ఎవరి వైఫల్యం? దాడులకు ఎవరు పాల్పడుతున్నారు? ఎవర్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి? అధికారులు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై నివేదిక సమర్పించాలని, వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)