చాబహార్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా ఇచ్చిన పరోక్ష వార్నింగ్ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌ని చిన్నచూపు చూడొద్దని, ఇది ఎన్నో ప్రయోజనాలను చేకూరిస్తుందని తెలిపారు. గతంలో చాబహార్ ఔచిత్యాన్ని స్వయంగా యూఎస్ ప్రశంసించిందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. బుధవారం కోల్‌కతాలో తాను రాసిన పుస్తకం 'వై భారత్ మ్యాటర్స్' బంగ్లా ఎడిషన్‌ను ఆవిష్కరించిన తర్వాత జరిగిన ఇంటరాక్షన్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''అమెరికా చేసిన వ్యాఖ్యల గురించి నేను విన్నాను. కానీ.. ఈ చాబహార్ పోర్టు ఒప్పందం అనేది ప్రతిఒక్కరి ప్రయోజనం కోసం. ఈ విషయం అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలి, ఒప్పించగలగాలని నేను భావిస్తాను. ఈ ప్రాజెక్ట్‌ని ఏ ఒక్కరూ చిన్నచూపు చూడకూడదు. గతంలో అమెరికా కూడా అలా చేయలేదు. ఈ చాబహార్ పోర్టు పట్ల అమెరికా వైఖరిని పరిశీలిస్తే.. దాని గొప్పదనాన్ని, విశాల ఉపయోగాలను ఆ అగ్రరాజ్యం మెచ్చుకుంది'' అని జైశంకర్ చెప్పుకొచ్చారు. అలాగే.. అమెరికా చేసిన వ్యాఖ్యలపై తాము చర్చిస్తామని కూడా తెలిపారు. ఈ ఒప్పందం భారత్‌తో పాటు మధ్య ఆసియా దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య వ్యవహారాలు నెరపేందుకు 'చాబహార్ పోర్టు' ప్రధాన మార్గంగా ఉంది. ఈ మార్గం ద్వారా కజకిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరుకు రవాణా చేయవచ్చు. అందుకే.. చాబహార్ నిర్వహణ కోసం ఇరాన్‌తో భారత్ పదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో ఇప్పుడు భారత్ కీలకపాత్ర పోషిస్తుంది. కేవలం పదేళ్లే కాకుండా దీర్ఘకాలిక ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఎందుకంటే అది లేకుండా పోర్ట్ ఆపరేషన్‌ని మెరుగుపర్చలేమని కూడా జై శంకర్ చెప్పుకొచ్చారు.
చాబహార్ పోర్టు ఒప్పందం ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసమే !
May 15, 2024
0
Tags