ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రీప్లేస్‌మెంట్ అనేదే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. మోడీ త్వరలోనే రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో అమిత్‌షాను తదుపరి ప్రధానిని చేయనున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అమిత్‌షా కొట్టిపారేశారు. 'ఇండియా' కూటమికి ఎలాంటి శుభవార్త లేనందున ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తోందని, అబద్ధాలతో వారు ఎన్నికల్లో గెలవలేరని అన్నారు. బీజేపీ గెలిస్తే అమిత్‌షాను ప్రధానమంత్రిగా చేస్తారంటూ కేజ్రీవాల్ శనివారంనాడు వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే అమిత్‌షా స్పందించారు. ''తూర్పు, పశ్చిమ, ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు చెందిన వారితో సహా దేశ ప్రజలంతా మోదీ వెంటే ఉన్నారు. బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని, మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని ఇండియా కూటమి నేతలకు బాగా తెలుసు. దీంతో ఈ తరహా అపోహలను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై నేను చాలా స్పష్టంగా చెప్పదలచుకున్నాను. బీజేపీ రాజ్యాంగంలో అలాంటి ప్రొవిజన్ ఏదీ లేదు. 2029 వరకూ మోడీనే ప్రధానిగా కొనసాగుతారు. ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు కూడా ఆయనే సారథ్యం వహిస్తారు. ఇందులో ఎలాంటి అయోమయానికి తావు లేదు. ఇండియా కూటమికి చెప్పుకోదగిన వార్త అంటూ ఏదీ లేకపోవడంతో ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలతో వారు ఎన్నికల్లో గెలవలేరు'' అని అమిత్‌షా స్పష్టం చేశారు.
మోడీకి రీప్లేస్‌మెంట్ లేదు !
May 11, 2024
0
Tags