మోడీ, రేవంత్‌వి ప్రవచనాలా ?

Telugu Lo Computer
0


బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కనుసన్నుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం పని చేస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై బ్యాన్‌ విధించారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ దారుణంగా మాట్లాడినా కనీసం ఈసీ స్పందించలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్‌ షా మత వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినా ఈసీ చర్య తీసుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. 20 వేల పైచిలుకు ప్రజలు ఈసీకి ఫిర్యాదు చేసిన కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా భయపడి నడ్డాకు లేఖ రాశారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శ్రీరాముని బొమ్మ పట్టుకొని ప్రచారం చేశారని ఫిర్యాదు చేసినా చర్యలు లేవని మండిపడ్డారు. రైతుల పక్షాన మాట్లాడితే కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిందని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఈసీకి బీఆర్‌ఎస్‌ ఎనిమిది ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ రోడ్‌ షోలకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్‌, బీజేపీకి నిద్ర పట్టలేదన్నారు. ఈసీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా గోడకు మొరపెట్టుకున్నా ఒకటే అన్నట్లుగా ఉందని కేటీఆర్ విమర్శించారు. రైతుల దుస్థితి చూసి బాధతో భావోద్వేగంతో కేసీఆర్‌ సిరిసిల్లలో మాట్లాడారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజలు, రైతులు, నేతన్నల తరఫున మాట్లాడిన కేసీఆర్ గొంతును నొక్కారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాలు, సూక్తులుగా వినిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు కేటీఆర్. ఈసీకి మెుత్తం 27 ఫిర్యాదులు ఇస్తే.. కేవలం కొండా సురేఖను మాత్రమే మందలించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ప్రజల్లోకి వెళ్లకుండా బీజేపీ, కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నాయన్నారు. మోడీ, రేవంత్‌ విషయంలో ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు తాత్కాలికంగా అపారేమో కానీ, ఏమీ చేయలేరని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్‌ఎస్‌కు 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)