కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవు !

Telugu Lo Computer
0


ర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గొడవలు మొదలైనాయని, సిద్దరామయ్య ప్రభుత్వానికి మూడిందని, త్వరలోనే సిద్దరామయ్య ప్రభుత్వం కుప్పకూలిపోతుందని బీజేపీ నాయకులు కొందరు ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రకటనలు మాత్రమే అని, కాంగ్రెస్‌లో ఎలాంటి విభేదాలు లేవని, మా మధ్య శత్రుత్వం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళవారం మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్దరామయ్య బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌ నేతల మధ్య శత్రుత్వం ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో అందరూ కలిసి ఎలా పని చేస్తారని, అలా కలిసి పని చేసే అవకాశం ఉండేది కాదని సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక ప్రభుత్వ పతనం గురించి మాట్లాడుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై కర్ణాటక సిద్దరామయ్య మండిపడ్డారు. మా గురించి మీరు మాట్లాడే బదులు ముందుగా మీ రాష్ట్రంలో మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే మీకే మంచిది అని మహారాష్ట్ర సీఎంకు సిద్దరామయ్య సూచించారు. విధాన పరిషత్ (ఎమ్మెల్సీ) ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో మేము ఉన్నామని సిద్దరామయ్య అన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు రాజకీయంగా పరిణతి చెందారని, రాజకీయాల గురించి వారికి స్పష్టమైన అవగాహన ఉందని సిద్దరామయ్య చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలతో విజయం సాధించాలని బీజేపీ నాయకులు కలలు కంటున్నారని, అది జరగనిపని అని సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం వలన మేలు జరిగిందా, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వలన మేలు జరిగిందా అని అంచనా వేసుకుంటున్న ఓటర్లు కచ్చితంగా మా అభ్యర్థులను ఆదరించి ఓటు వేస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోరు వల్లే సిద్దరామయ్య ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ నేతలు అంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి వాతావరణం నెలకొంది. ఇక ఈ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అందుకే ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేశామని, దీంతో అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు సమయం దొరికిందని సీఎం సిద్దరామయ్య చెప్పారు. బీజేపీ నాయకులకు పనిపాట లేకపోవడంతో నిత్యం మామీద పడి కొట్టుకుంటున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య బీజేపీ నాయకులపై మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)