ఎన్నికల ముందు వైకాపాను వీడి తెదేపాలో చేరారనే కక్షతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం గణపవరానికి చెందిన దళిత యువకుడు కత్తి రాజేష్‌పై వైకాపా బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే కోన రఘుపతి బంధువు, కర్లపాలెం మండలం వైకాపా ఇన్‌ఛార్జి, సినీ రచయిత కోన వెంకట్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. కర్లపాలెం పోలీసుస్టేషన్లో శనివారం ఎస్సై జనార్దన్ సమక్షంలోనే వారు దాడికి పాల్పడటం గమనార్హం. గణపరానికి చెందిన వైకాపా ఎస్సీ నాయకుడు కత్తి రాజేష్ తన అనుచరులతో కలిసి తెదేపా అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ సమక్షంలో శనివారం ఉదయం పార్టీలో చేరారు. రాజేష్ తమ వద్ద రూ.8 లక్షలకు పైగా డబ్బు తీసుకుని ఇప్పుడు తెదేపాలో చేరారని కర్లపాలెం పోలీసులకు వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. రాజేష్‌ను పోలీసు సిబ్బంది పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎస్సై ఛాంబర్‌లో ఎస్సై జనార్దన్ సమక్షంలో రాజేష్‌పై కోన వెంకట్, వైకాపా నాయకులు దాడి చేశారు. ఎస్సై జనార్దన్ కూడా యువకుడిని కొట్టారు. ఈ విషయం తెలిసి తెదేపా లోక్‌సభ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, అసెంబ్లీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కర్లపాలెం చేరుకున్నారు. యువకుడి కుటుంబసభ్యులు, గణపవరం ఎస్సీ కాలనీ వాసులు పోలీస్‌స్టేషన్ వద్ద కోన రఘుపతి, కోన వెంకట్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనపై జరిగిన దాడిపై రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 10గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఎదుట తెదేపా శ్రేణులు, బంధువులు, ఎస్సీ కాలనీ వాసులతో కలిసి రహదారిపై బైఠాయించి రాజేష్ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజేష్‌పై దాడి చేసిన కోన వెంకట్, మార్పు బెనర్జీ, మార్పు రత్నం, కాగిత మోజెస్(మోషే), ఉపాధ్యాయుడు నక్కా సంతోష్, ఎస్సై జనార్దన్‌లపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేష్‌పై పోలీస్‌స్టేషన్లో ఎస్సై సమక్షంలోనే వైకాపా నాయకులు దాడి చేయటానికి సంబంధించి ఎస్సై జనార్దన్‌పై డీఎస్పీ మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఎస్పీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్పీ వకుల్ జిందాల్... ఎస్సై జనార్దన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
దళిత యువకుడిపై కోన వెంకట్ దాడి ?
May 12, 2024
0
Tags