భారీగా నష్టపోయిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు !

Telugu Lo Computer
0


రస లాభాలతో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలకు గట్టి షాక్‌ తగిలింది. వారాంతంలో ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలకు అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌ రూపంలో 'హెవీ' స్ట్రోక్‌ తగిలింది. రిలయన్స్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో ఓ దశలో 1100కు పైగా పాయింట్లు సెన్సెక్స్‌ కోల్పోయింది. ఆఖర్లో కాస్త కోలుకుని మూడెంకల నష్టాల నుంచి బయటపడింది. నిఫ్టీ 22,450 స్థాయికి చేరింది. ఉదయం సెన్సెక్స్‌ 75,017.82 (క్రితం ముగింపు 74,611.11) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపటి వరకు లాభాల్లోనే కొనసాగింది. తర్వాత నష్టాల పరంపర మొదలైంది. అలా రోజంతా పడుతూనే ఉంది. ఇంట్రాడేలో 73,467.73 వద్ద కనిష్ఠాన్ని సూచీ టచ్‌ చేసింది. అంటే గరిష్ఠాల నుంచి దాదాపు 1600 పాయింట్లు కోల్పోయింది. చివరికి 732.96 పాయింట్ల నష్టంతో 73,878.15 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 191.55 పాయింట్ల నష్టంతో 22,456.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.43గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఎల్‌అండ్‌టీ, మారుతీ, రిలయన్స్‌, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్‌ ప్రధానంగా నష్టపోయాయి. బజాజ్‌ ఫైనాన్స్‌కు చెందిన ఇ-కామ్‌, ఇన్‌స్టా ఈఎంఐ కార్డుపై గతంలో విధించిన నిషేధాన్ని ఆర్‌బీఐ ఎత్తివేయడంతో బజాజ్‌ ద్వయం రాణించేందుకు దోహద పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83.58 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)