అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భారాస అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. సిరిసిల్లలో ఏప్రిల్ 5న నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక పోయారని వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ఈసీ.. భారాస స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించింది. ఈ రోజు రాత్రి 8గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. తన ఎన్నికల ప్రచారాన్ని 48గంటల పాటు నిలిపియాలని ఈసీ జారీ చేసిన ఆదేశాలపై భారాస అధినేత కేసీఆర్ స్పందించారు. ''నా మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదు. స్థానిక మాండలికాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని వాటిపై ఫిర్యాదు చేశారు. నా వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదు. కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించా. నా మాటలను కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారు''అని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం పట్ల భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ''ఇదెక్కడి అరాచకం? ఏకంగా కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? బడే భాయ్.. చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా ఇది!'' అని ట్వీట్ చేశారు.
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం !
May 01, 2024
0
Tags