భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న స్విస్‌ కంపెనీలు !

Telugu Lo Computer
0


స్విట్జర్లాండ్‌కు చెందిన అనేక కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ హెలెన్ బడ్లిగర్‌ తెలిపారు. హెస్‌ గ్రీన్‌ మొబిలిటీ 2025 నాటికి భారత్‌లో 3,000 విద్యుత్తు బస్సులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అందుకోసం వచ్చే 6-8 ఏళ్లలో 110 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. బారీ క్యాలిబాట్‌ తన మూడో తయారీ కేంద్రాన్ని భారత్‌లో 2024లోనే ప్రారంభించే యోచనలో ఉందని బడ్లిగర్‌ తెలిపారు. గత ఐదేళ్లలో కంపెనీ ఇక్కడ 50 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. మరోవైపు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి 30 ఏళ్లు నిండిన సందర్భంగా వచ్చే 2-3 ఏళ్లలో బుహ్లర్‌ 23 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు ఆసక్తిగా ఉందని వెల్లడించారు. వీటితో పాటు అనేక చిన్న కంపెనీలు భారత్‌ వైపు చూస్తున్నాయని చెప్పారు. రవాణ/రైల్వే, ప్రెసిషన్‌ ఇండస్ట్రీస్‌, ఆటోమేషన్‌ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యాపారానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని బడ్లిగర్‌ తెలిపారు. ఈ పరిశ్రమల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందించడానికి స్విస్‌ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న భారత్‌ వంటి దేశాలకు అది చాలా అవసరమని వివరించారు. భారత్‌-ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరిన విషయం తెలిసిందే. దీంతోపాటు రాబోయే 15 ఏళ్లలో మన దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకు హామీ లభించింది. ఇందువల్ల 10 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, లిక్టన్‌స్టైన్‌, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఒప్పందంతో స్విట్జర్లాండ్‌ వాచీలు, కట్‌ అండ్‌ పాలిష్డ్‌ వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)