'మేడిగడ్డ విషయంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం తప్పు చేసినట్లు, దానికి మేమే బాధ్యత వహించాలన్నట్లు ప్రధాన ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. పదే పదే భాష గురించి, మమ్మల్ని గౌరవించటం లేదని సభలో అంటున్నారు. నల్గొండలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగించిన భాష గురించి చర్చిద్దామా' అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ.. 'కృష్ణా జలాలతోపాటు వివిధ ప్రాజెక్టులను చూసి వచ్చి వాస్తవాల ప్రాతిపదికన చర్చిద్దామని అన్ని పార్టీల శాసనసభ్యులను ఆహ్వానించాం. రైతులపై, తెలంగాణ సమాజంపై గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం రావాలి కదా. అందరం కలిసి అక్కడికి వెళ్లి.. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని, రైతులకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉండేది. దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేయటం పద్ధతా? మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఉన్న అధికారం పోగొట్టారు. అయినా ఆ పార్టీ బుద్ధి మారలేదు. మేడిగడ్డ మేడిపండు చందంగా కుంగిపోతే.. అందులో నీళ్లు నింపాలని ఎలా అడుగుతున్నారు? నీటిపారుదల మంత్రులుగా పని చేసిన అనుభవం కేసీఆర్, హరీశ్‌రావులకు ఉంది. వాళ్లకే పెత్తనం ఇస్తాం.. మేడిగడ్డలో ఎలా నీళ్లు నింపుతారు? అక్కడి నుంచి అన్నారం, తర్వాత సుందిళ్లలో నీళ్లు ఎలా ఎత్తిపోస్తారో పోయమనండి. మొత్తం కుంగిపోయి.. నీళ్లు నింపేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా దెబ్బతింది. ఖర్చు చేసిన రూ. 94 వేల కోట్లు వృథా అయింది. ప్రజలకు సమాధానం చెప్పలేక, శాసనసభకు రాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? మీరు చర్చకు సిద్ధమైతే మీ నాయకుడిని సభకు పిలవండి. కాళేశ్వరం ప్రాజెక్టుపైనా, గోదావరి జలాలపైనా చర్చిద్దాం. సభకు రాకుండా ప్రతిపక్ష పార్టీ బాధ్యత నుంచి తప్పించుకున్నట్లవుతుంది. కాళేశ్వరంలో మీ అవినీతి బయటపడుతుందని, జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చర్చకు రావటం లేదు. కేసీఆర్‌ను చంపుతారా? అంటున్నారు. ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? చచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకేంటి? సానుభూతి కోసం వీల్ ఛైర్‌తో నాటకాలాడుతున్నారు. మీరు అవినీతికి పాల్పడకపోతే, మీలో నిజాయతీ ఉంటే, మీరు చెబుతున్నట్లు మేడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు మాత్రమే కుంగిపోతే దాని మీద నిర్ణయాలు తీసుకునేందుకు రమ్మనండి. అక్కడెక్కడికో వెళ్లి ప్రగల్భాలు పలకడమేంటి? అసెంబ్లీకి రమ్మనండి.. చర్చిద్దాం. వాస్తవాలన్నీ సభలో పెడతాం. సాగునీటి ప్రాజెక్టులపై ఎలాగూ శ్వేతపత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అప్పుడు చర్చిద్దాం. కాదంటారా.. కాళేశ్వరంపైనే చర్చ అంటే ప్రత్యేకంగా మేమూ సిద్ధంగా ఉన్నాం' అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
వాళ్లకే పెత్తనమిస్తాం - నీళ్లు నింపమనండి !
February 15, 2024
0
Tags