పతంజలి ఆయుర్వేద సంస్థపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమనుల్లాతో కూడిన ధర్మాసనం మండిపడింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ కొన్ని సూచనలు కూడా చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రకటనలూ ఇవ్వొద్దని మరోసారి సూచించింది. ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో పతంజలిని మందలించింది. వివిధ రకాల వ్యాధులను నయం చేస్తుందంటూ 'అసత్య', 'తప్పుదోవ' పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ప్రకటనల విషయంలో చూసీచూడనట్లుగా కేంద్రం వ్యవహరించడాన్ని తప్పుబట్టింది.
పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ
February 27, 2024
0
Tags