గుజరాత్‌లో 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒకే తరగతి గదితో నడుస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేబుర్ దిండోర్ అసెంబ్లీలో మంగళవారం ఇచ్చిన సమాచారం చర్చనీయాంశంగా మారింది. దీంతో అక్కడి పాఠశాలల పరిస్థితిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్నా ఇంకా ఒక్కో గదిలోనే 341 స్కూళ్లు నడుస్తున్నాయంటే గుజరాత్ ప్రభుత్వానికి ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదన్నారు. ఇలాగైతే భారతదేశం ఎలా పురోగమిస్తుందని 'ఎక్స్' (ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్‌లో 25 శాతం నిధుల్ని విద్యపైనే ఖర్చు చేస్తోందని, తమ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు నీట్, జేఈఈ, ఎన్‌డీఏ వంటి పరీక్షల్లో విజయం సాధిస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తేనే పిల్లలు చదువుకుని, అభివృద్ధి చెంది దేశాన్ని ముందుకుతీసుకెళ్తారని పేర్కొన్నారు. ఈ పనిని తాము ఢిల్లీలో చేస్తున్నామని, పంజాబ్‌లో కూడా ప్రారంభించామన్నారు. దేశంలో తమకు ఎక్కడ అవకాశం వచ్చినా ఇలాగే చేస్తామని.. దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరీట్ పటేల్ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి కుబేర్ దిండోర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో 2023 డిసెంబర్ నాటికి 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒకే తరగతి గదితో నడుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, విద్యా విభాగంలో 1,400 ఉన్నతస్థాయి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చివేయడం, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడం, కొత్త తరగతి గదులు నిర్మించేందుకు స్థలం లేకపోవడం వంటి కారణాలతో కొన్ని పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొందని కుబేర్ దిండోర్ వివరించారు. ఆయా స్కూళ్లలో కొత్త తరగతి గదులను వీలైనంత వేగంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఇలాగైతే దేశం ఎలా పురోగమిస్తుంది ?
February 22, 2024
0
Tags