శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రూ.2.70 కోట్లను సీజ్ చేశారు. కొన్ని నెలల క్రితమే ఈ మొత్తాన్ని చెల్లించినట్టు గుర్తించారు. ఇంకా ఏయే సంస్థల్లో పెట్టుబడులు పెట్టాడనే అంశాంపై కూపీ లాగుతున్నారు. శివ బాలకృష్ణకు సోదరుడు శివ నవీన్‌తో పాటు మరో నలుగురు బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. ఆయన ఆదేశాల మేరకు పనిచేసిన అధికారుల వ్యవహారంపై కూడా దృష్టి సారించారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఆయన వద్ద పనిచేసిన వారిని సైతం త్వరలో ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు బినామీలుగా గుర్తించిన సత్యనారాయణ మూర్తి, పెంటా భరత్‌ను రెండ్రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించిన అధికారులు ఆస్తుల వివరాలను సేకరించారు. విచారణలో శివ బాలకృష్ణ చెప్పిన ఐఏఎస్ అధికారిని విచారించేందుకు న్యాయ సలహా తీసుకున్న ఏసీబీ, నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధంగా ఉంది.
శివబాలకృష్ణ ఫ్లాట్ కొనుగోలుకు ఇచ్చిన రూ.2.70 కోట్లు సీజ్
February 16, 2024
0
Tags