నిత్యానంద దెబ్బకి పరాగ్వే వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఊడిపోయింది !

Telugu Lo Computer
0


వివాదాస్పద స్వామిజీ నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన స్థాపించిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే వ్యవసాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇదే తరహాలో నిత్యానంద దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను తప్పుదోవపట్టించినట్లు సమాచారం. ఈ ఏడాది మొదట్లో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ప్రతినిధులు జెనీవాలో నిర్వహించిన ఐరాస సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాసతో దౌత్యసంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని పరాగ్వే మంత్రి అర్నాల్డో చమర్రో ఓ ప్రకటనపై సంతకం చేశారు. దీనిపై పరాగ్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఇదో కుంభకోణమని ఆరోపిస్తూ.. నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తూర్పార పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో పరాగ్వే వ్యవసాయ శాఖ మంత్రి ఆర్నాల్డో తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా, కెనడాకు చెందిన స్థానిక నాయకులతో కూడా కైలాస ప్రతినిధులు ఇదే తరహాలో పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటన గురించి ఆర్నాల్డో చమర్రో స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ..''యునైటెడ్‌ స్టేట్స్ ఆఫ్‌ కైలాస ఎక్కడుందో నాకు తెలియదు. మౌలిక సదుపాయాలు, నీటి పారుదలకు సంబంధించి పరాగ్వేకు సాయం చేస్తామని కైలాస ప్రతినిధులు ముందుకు రావడంతో నేను ప్రకటనా పత్రాలపై సంతకం చేశాను'' అని తెలిపారు. మరోవైపు పరాగ్వేలోని స్థానిక మున్సిపాలిటిలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను కైలాస సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉంచడంతో దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధుల ఇదే తరహాలో మోసం చేశారు. ఈ మేరకు నెవార్క్‌ నగర యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)