ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనేది రాజకీయ నినాదం కాదు !

Telugu Lo Computer
0


పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడిగా వేడిగా కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూకశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో మంగళవారం చర్చ జరిగింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. గతంలో జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి హోంమంత్రి అమిత్ షా ఏం సాధించారని నిలదీశారు. ''అక్కడ శాసనసభే లేనప్పుడు ఈ సవరణ బిల్లులు పెట్టి ప్రయోజనం ఏంటీ? ముందు శాసనసభను ఏర్పాటు చేసి ఆ తర్వాత సవరణలు చేయండి. మీ వేగాన్ని జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలో చూపించండి. 'ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం' అని భాజపా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఆర్టికల్‌ 370ని రద్దు చేశారు. ఈ నినాదాన్ని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఇచ్చారు. అయితే, ఇది జమ్మూకశ్మీర్‌ ప్రజలకు కాదు. అది కేవలం రాజ్యాంగ నినాదం మాత్రమే'' అని సౌగతా రాయ్‌ వ్యాఖ్యానించారు. దీనికి అమిత్ షా తీవ్రంగా స్పందిస్తూ  ''రాయ్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఒక దేశానికి ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఎలా ఉంటాయి? గతంలో కొందరు (కాంగ్రెస్‌ పాలనను ఉద్దేశిస్తూ) ఈ తప్పే చేశారు. దాన్నే ప్రధాని మోడీ సరిదిద్దారు. 'ఒకే ప్రధాని, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం' అనేది రాజకీయ నినాదం కాదు. 1950ల నుంచే మనం 'ఏక్‌ ప్రధాన్‌, ఏక్‌ నిషాన్‌, ఏక్‌ విధాన్‌' ఉండాలని చెబుతున్నాం. దాన్నే మా ప్రభుత్వం అమలు చేసింది'' అని హోంమంత్రి వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)