తీరం దాటిన తుఫాన్ !

Telugu Lo Computer
0

మిచౌంగ్ తుఫాన్  బాపట్ల దగ్గర తీరాన్ని దాటింది. సముద్రం నుంచి తుఫాన్ భూమిపైకి వచ్చింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల విధ్వంసంతో అతి పెద్ద తుఫాన్ తీరం దాటడంతో  పెను విధ్వంసం సృష్టించినట్లు ప్రాథమిక సమాచారం. బాపట్ల, వేటపాలెం, చీరాల ప్రాంతాలపై తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే చెట్లు కూలిపోయాయి.. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తుఫాన్ తీరం దాటటంతో కుండపోత వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. తుఫాన్ మిచౌంగ్ తీరం దాటే సమయంలో పెను గాలులకు పంటలు దెబ్బతిన్నాయని, రహదారులు ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విధ్వంసం చేశాయని.. వర్షాలు తగ్గిన తర్వాత నష్టం అంచనాకు వస్తుందని స్పష్టం చేశారు అధికారులు. తుఫాన్ తీరం దాటినా.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని.. 50 మీటర్లు ముందుకు వచ్చిందని, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని.. ఎవరూ సముద్రం వైపు వెళ్లొద్దని అధికారులు ప్రకటించారు. ఏపీలోని ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, విజయనగరం, రాజమండ్రి, విశాఖపట్నం, ఏలూరు జిల్లాలకు రెడ్​అలర్ట్ జారీ అయ్యింది. మిగతా జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)