రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం !

Telugu Lo Computer
0


చైనాలోని చిన్నారుల్లో వ్యాపిస్తోన్న నిమోనియాపై ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి. శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని చైనా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాను సంప్రదించి నివేదిక తెప్పించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతానికి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ అటువంటి సమస్యలు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధతపై సమీక్ష చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది.ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ సూచనలు జారీచేసింది. మానవ వనరులు, ఆసుపత్రి పడకలు, అవసరమైన ఔషధాలు, యాంటీ బాడీలు, ఆక్సిజన్, పీపీఈ, టెస్టు కిట్ల వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన చర్యలపై నిశితంగా సమీక్ష జరపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఇన్ ఫ్లుయెంజా వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల శ్వాబ్ నమూనాలను వైరస్ రీసెర్చి అండ్ డయాగ్నొస్టిక్స్ ల్యాబ్ లకు పంపించాలన్నారు. తద్వారా కొత్త వైరస్ ల ప్రభావం ఏమైనా ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చన్నారు. చైనాలో నిమోనియా కేసుల విజృంభణను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీనిపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఈ అంశంపై పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. నిమోనియా బాధితుల్లో ఎటువంటి కొత్త వైరస్ లేదని చైనా అధికారిక పత్రిక తెలిపింది. ప్రధానంగా బీజింగ్, లియోనోంగ్ లో చేసిన పరీక్షల్లో ఎటువంటి కొత్త వైరస్ ను గుర్తించలేదని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)