బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ సమీపంలో హమూన్ తుఫాన్ బుధవారం ఉదయం తీరం దాటింది. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగ్లాదేశ్, మిజోరం వైపు పయనిస్తోంది. ఈశాన్య దిశగా కదిలి అల్పపీడనంగా రూపాంతరం చెందినట్లు వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటున సముద్రమట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గురువారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. పార్వతీపురంలో 28.4 మిల్లీ మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 24.2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 10.6, కొమరాడలో 6.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
తీరం దాటిన హమూన్ తుఫాన్ !
October 26, 2023
0
Tags