కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవకాశవాదంపై నెటిజన్ల ఫైర్‌ !

Telugu Lo Computer
0

తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మళ్లీ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ప్రకటించారు. దీంతో నాడు రాజగోపాల్‌పై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పార్టీలు మారిన సమయంలో నాడు కాంగ్రెస్‌ మీద, నేడు బీజేపీపై రాజగోపాల్‌రెడ్డి చేసిన విమర్శలు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆయన అప్పట్లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది.కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన స్వప్రయోజనాల కోసమే ఆయన పార్టీలు మారుతున్నారని మండిపడుతున్నారు. గత ఏడాది ఆగస్టులోనే ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చి బీజేపీలో చేరారు. ఏడాది తిరిగేలోగా బీజేపీని పక్కనపెట్టి మళ్లీ కాంగ్రెస్‌ చేయి అందుకోనున్నారు. బీజేపీలో చేరినప్పుడు 'కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో ఆదరించే పరిస్థితి లేదు. ఆ పార్టీ దండగ' అంటూ విమర్శలు గుప్పించారు. 'రేవంత్‌రెడ్డి వంటి బ్లాక్‌మెయిలర్‌ కింద పనిచేయడం కన్నా రాజకీయాల నుంచి తప్పుకోవడం మేలు' అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు వచ్చేప్పుడు రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ లేదని అందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. నాడు, నేడు కూడా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డినే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారా అంటూ నెటిజన్లు రాజగోపాల్‌రెడ్డిపై సెటైర్లు వేస్తున్నారు. ఆయన రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చారని, అందుకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)