కొడుకుని పైలట్ గా చూసుకుని ఓ తల్లి సంబరపడిపోయింది. 30 ఏళ్ల తన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు అతడిని కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు చెప్పించడానికి వారిని మంచి స్ధాయిలో చూడటానికి చాలా కష్టపడతారు. అలాగే ఓ మహిళ పైలట్ కావాలనుకున్న కొడుకు కోరిక తీర్చడం కోసం 30 ఏళ్లు హౌస్ కీపర్‌గా పనిచేసింది. చివరికి ఆమె కష్టానికి ప్రతిఫలం లభించింది. విమానం ఎక్కిన ఆమె పైలట్‌గా కనిపించిన కొడుకుని చూసి స్పందించిన తీరు అందరి మనసుల్ని కదిలించింది. రెడ్డిట్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో మహిళ ఫ్లైట్‌లోకి రావడం.. సిబ్బంది ఆమెను తనిఖీ చేయడం కనిపిస్తుంది. కొన్ని సెకన్లలో ఎయిర్ హోస్టెస్ కర్టెన్లను తీయగానే ఆమె కొడుకు పూల బొకేతో నిలబడి ఉండటం చూస్తుంది. పైలట్ యూనిఫాంలో ఉన్న కొడుకుని చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే ఎమోషనలై కొడుకుని హత్తుకుని సంబరపడిపోయింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆమె కష్టానికి, త్యాగానికి ప్రతిఫలంగా ఆమె కొడుకు తన కల నెరవేర్చడం ఎంత అద్భుతమైన వీడియో అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
కొడుకుని పైలట్ గా చూసి మురిసిన తల్లి !
October 22, 2023
0
Tags