ప్రొద్దుటూరులో 300 కేజీల బంగారం సీజ్‌ !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో గత నాలుగు రోజులుగా జరపుతోన్న ఐటీ అధికారుల తనిఖీలు నేటితో ముగిశాయి. నాలుగు ప్రముఖ జ్యూవెలరీ షాపుల్లో ఐటీ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు. లెక్కలో లేని దాదాపు 300 కేజీల బంగారాన్ని సీజ్‌ చేసినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. ముంబాయి తర్వాత ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం జోరుగా సాగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. గోల్డ్‌ బిజినెస్‌లో ప్రొద్దులూరుకు రెండో ముంబాయి అనే పేరు కూడా ఉంది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు ప్రముఖ జ్యువెల్లరీ షాపుల్లో దాడి చేశారు. నగరంలోని బుశెట్టి జ్యువెలర్స్‌, డైమండ్స్ జ్యువెలర్స్‌, గురు రాఘవేంద్ర జ్యువెలర్స్‌, తల్లం జ్యువెలర్స్‌లలో ఐటీ అధికారులు నాలుగు  రోజులు తనిఖీలు చేపట్టారు. సోదాలు జరుగుతున్న జ్యూవెలర్స్ షాపుల వద్ద సీఆర్పీఫ్ పోలీసులు సైతం మోహరించారు. దాడుల సమయంలో బయట నుంచి షాపుల్లోకి ఎవ్వరినీ వెళ్లకుండా సీఆర్పీఫ్ బలగాలు అడ్డుకున్నాయి. నగరంలో ఐటీ దాడుల నేపథ్యంలో పలు జ్యువెల్లరీ షాపులను యజమానులు క్లోజ్‌ చేశారు. దసరా పండగ సమయంలో షాపులన్నీ మూసివేసయంతో వినియోగదారులకు నిరాశ ఎదురైంది. ఈ దాడుల్లో ఎలాంటి బిల్లులు, ఆధారాలు లేని బంగారాన్ని భారీ ఎత్తున సీజ్ చేశారు. ఆ బంగారం అంతటినీ ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. కాగా ప్రొద్దుటూరులో 2 వేలకు పైగా బంగారం, స్వర్ణకారుల షాపులు ఉన్నాయి. ప్రత్యేకించి నాలుగు షాపుల్లో మాత్రమే తనిఖీలు చేపట్టడంతో కడప జిల్లా వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)