కిలో నెయ్యి రూ.2 లక్షలు !

Telugu Lo Computer
0

గుజరాత్ లోని రాజ్‌కోట్, గోండాల్‌లోని గిర్‌ గౌ జత్నా సంస్థాన్‌ నిర్వహకుడు రమేష్‌ భాయ్‌ రూపరేలియా తన గోశాలలో 200లకు పైగా ఆవులను పెంచుతున్నాడు. ఈ గోశాలలోని ఆవుల మూత్రం, పాలు, పేడ, మజ్జిగ, నెయ్యి వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తుంటాడు. ఎలాంటి కల్తీకి తావులేకుండా స్వచ్ఛమైనవి విక్రయిస్తుంటాడు. అతను తయారు చేసే నెయ్యికి మంచి డిమాండ్‌ ఉంది. ఎందుకుంటే పురాతన గ్రంధాలను అనుసరించి కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు వంటి వివిధ మూలికలు, ఔషధ మొక్కలను నెయ్యిలో వేసి బాగా మరిగించి ప్రత్యేకంగా తయారు చేస్తాడు. ఇలా తయారు చేసిన నెయ్యి కిలో రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు విక్రయిస్తుంటాడు. ఈ ఖరీదైన నెయ్యికి స్థానికంగా మాత్రమేకాకుండా దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇలా తయారు చేసిన నెయ్యిని తినడానికి మాత్రం వాడరు. కేవలం చర్మానికే దీనిని వినియోగిస్తుంటారు. ఈ నెయ్యి కాస్త రాసుకుంటే తలనొప్పి, చర్మవ్యాధులూ తగ్గుతాయని, వాసన చూస్తే దగ్గు అదుపులో ఉంటుందని వినియోగదారులు చెబుతుంటారు. అంతేకాకుండా ఈ వనమూలికల నెయ్యి రాసుకుంటే చర్మంపై మొటిమల్నీ, నల్లమచ్చల్నీ అదుపుచేస్తుందట. కిలో నెయ్యి తయారీకి 31 లీటర్ల పాలు అవసరం అవుతాయి. నెయ్యి తయారీ నుంచి డోర్‌ డెలివరీ వరకు మొత్తం 140 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రమేష్‌ భాయ్‌ గత 17 ఏళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. 26 దేశాలకు చెందిన14 వేల మంది యువకులు ఈ గోశాలలో శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, సౌదీ అరేబియా వంటి దాదాపు 100కుపైగా దేశాల్లో రమేష్‌భాయ్ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. ఈ వనమూలికల నెయ్యి ద్వారా నెలకు రూ.10 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)