పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం హైదరాబాదీల ప్రేమకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమకు ఘన స్వాగతం పలికినందుకు సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ క్రికెట్ జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆడనున్న వార్మప్, కొన్ని ప్రధాన మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదికకానున్న తరుణంలో బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో టీమ్ ల్యాండ్ అయింది. వీసా సమస్యలు తీరడంతో దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వారికి స్వాగతం పలకగా.. పోలీసుల పటిష్ట భద్రత నడుమ పార్క్ హయత్‌కు ఆటగాళ్లు చేరుకున్నారు. కాగా దాదాపు ఏడేళ్ల తర్వాత పాక్ జట్టు ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు సైతం ఎయిర్‌పోర్టు బయట దారి పొడవునా నిల్చొని ఘన స్వాగతం పలికారు. టీమ్ బస్‌లో తరలివెళ్తున్న పాక్ క్రికెటర్లను కెమెరాలలో బంధిస్తూ వారికి విష్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో బాబర్ ఆజం హైదరాబాద్ ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు. ''హైదరాబాద్‌లో.. మీ అంతులేని ప్రేమ, మద్దతు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా'' అంటూ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ మేరకు బాబర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
హైదరాబాద్‌లో బాబర్ కు ఘన స్వాగతం
September 28, 2023
0
Tags