విక్రమ్‌ ల్యాండర్‌ మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బాలుడు !

Telugu Lo Computer
0


ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతున్నది. సన్‌ మిషన్‌కు సంబంధించిన తొలి ప్రయోగమైన ఆదిత్య ఎల్‌1ను శనివారం విజయవంతంగా నింగిలోకి పంపింది. అలాగే గత నెలలో ఇస్రో చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 సక్సెస్‌ అయ్యింది. ఆగస్ట్‌ 23న విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యింది. దీంతో మూన్‌ సౌత్‌ పోల్‌పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్రకెక్కింది. కాగా, వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రోతో పాటు ఆ సంస్థ ఛైర్మన్‌ సోమనాథ్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పొరుగున ఉండే ఒక బాలుడు శనివారం ఆయనను కలిశాడు. సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ మోడల్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 'ఇస్రో చీఫ్ సోమనాథ్‌ను ఇవాళ ఒక ఆశ్చర్యకరమైన సందర్శకుడు కలిశాడు. పొరుగున ఉండే బాలుడు సొంతంగా తయారు చేసిన విక్రమ్ ల్యాండర్ మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇరుగుపొరుగు వారందరి తరపున ఇస్రో చీఫ్‌కి దానిని అందజేశాడు' అని ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)