భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక్కసారిగా విమాన టికెట్ ధరలు పెరిగాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు తమ ప్రణాళికల్లో మార్పులు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ట్రావెల్ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కంటే ప్రస్తుతం భారత్-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలు 25 శాతం మేర పెరిగాయని తెలిపాయి. గురువారం భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయడంతో దిల్లీ నుంచి టొరంటో విమాన టికెట్ బుకింగ్స్‌కు చివరి నిమిషంలో డిమాండ్ పెరిగిందని వెల్లడించాయి. భారత్-కెనడాల మధ్య ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడాలు విమాన సర్వీసులను నిర్వహిస్తున్నాయి. వారానికి 48 విమానాలు ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు ఢిల్లీ-టొరంటో, ఢిల్లీ-వాంకోవర్ మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఎయిర్ కెనడా ఢిల్లీ-టొరంటో మధ్య ప్రతి రోజూ విమాన సర్వీసులను నడుపుతోంది. దాంతోపాటు వారంలో మూడు విమాన సర్వీసులను ఢిల్లీ-మాంట్రియల్ మధ్య నిర్వహిస్తోంది.
భారత్-కెనడాల మధ్య విమాన టికెట్ ధరలకు రెక్కలు
September 22, 2023
0
Tags