సీడబ్ల్యూఎంఏ ఆర్డర్‌పై స్టే ఇవ్వండి : సుప్రీంకోర్టుకు సిద్ధరామయ్య వినతి !

Telugu Lo Computer
0


కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలన్న సీడబ్ల్యూఎంఏ (కావేరీ వాటర్ మానేజ్ మెంట్  అథారిటీ) ఆదేశాలపై స్టే ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఈ సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. కావేరీ జలాల సమస్యపై కేంద్ర మంత్రులు, అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ... సీడబ్ల్యూఎంఏ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించాలని కోరుతున్నామని, దీనిపై తాము అప్పీల్ చేస్తామని చెప్పారు. 'తమిళనాడుకు నీటిని విడుదల చేయాలన్న సీడబ్ల్యూఎంఏ ఆదేశాలపై నిషేధం విధించాలనే డిమాండ్ తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. మేము సీడబ్ల్యూఎంఏకి వాస్తవ పరిస్థితిని వివరించాం. ఆగస్టులో రాష్ట్రంలో 123 ఏళ్లలోనే అత్యల్ప వర్షపాతం నమోదైంది. దీంతో మాకు తాగు, సాగు, పరిశ్రమలకు నీరు లేకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో సమావేశమయిన అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకుంటాం. కర్ణాటకలో 195 కరువు పీడిత ప్రాంతాలను గుర్తించాం. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం కేంద్రానికి అందజేస్తాం" అని సీఎం అన్నారు. కావేరీ నదీ జలాల పంపిణీ వివాదంపై చర్చించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన కేంద్ర మంత్రులు, కర్ణాటకకు చెందిన అఖిలపక్ష ఎంపీలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)