కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ సంస్థను కేటగిరీ 1 మినీరత్న నుంచి 'నవరత్న' హోదా కల్పించేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం నవరత్న సంస్థల సంఖ్య 14కి చేరింది. ఓఎన్‌జీసీ విదేశ్.. కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ ఆధీనంలో పని చేస్తోంది. తాజాగా నవరత్న హోదా పొందడంతో సంస్థలో పెట్టుబడి, జాయింట్ వెంచర్ల ఏర్పాటు, ఇతర ఆర్థిక నిర్ణయాల విషయంలో సంస్థకు మరింత స్వయంప్రతిపత్తి ఉంటుంది. '' కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ సంస్థను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ గా గుర్తించేందుకు ఆమోదం తెలిపారు.'' అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (పీడీఈ) ట్విటర్‌లో పేర్కొంది. ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ వార్షిక టర్నోవర్ రూ.11,676 కోట్లు కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1700కోట్లు లాభాలు గడించింది. ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థకు నవరత్న హోదా దక్కాలంటే.. మినీరత్న హోదా కలిగి ఉండి.. కనీసం నలుగురు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఉండాలి. అంతేకాకుండా సంస్థ నికర విలువ, లాభాలు, ఉత్పత్తి విలువ, సేవల విలువ, మూలధన ఉపాధి, తరుగుదల, వడ్డీ, పన్నులు చెల్లించక ముందు లాభమెంత? తదితర అంశాలపై 60శాతంపైగా స్కోరు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్,ఆయిల్ ఇండియా లిమిటెడ్ తదితర 13 నవరత్న సంస్థలు ఉన్నాయి. తాజాగా ఓఎన్‌జీసీ విదేశ్‌కు 14 సంస్థగా నవరత్నలో చోటు దక్కింది.
నవరత్నాల సరసన 'ఓన్‌జీసీ విదేశ్'
August 03, 2023
0
Tags