ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు దిల్లీలో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయి పైనే ప్రవహిస్తుండగా ఇప్పుడు ఉత్తరాఖండ్ లో గంగా నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో అలకనంద నదిపై ఉన్న జీవీకే హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ డ్యామ్ నిండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. హరిద్వార్ లో గంగానది వార్నింగ్ స్థాయి అయిన 293 మీటర్లను దాటి ప్రమాదకరంగా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే శిబిరాలకు తరలించారు. హరిద్వార్, రూర్కీ, ఖాన్‌పుర్, భగవాన్‌పుర్, లస్కర్ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా 17 రోడ్లు, తొమ్మిది వంతెనలు దెబ్బతిన్నాయి. అటు సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. https://t.me/offerbazaramzon
గంగా నది ఉగ్రరూపం
July 17, 2023
0
Tags