దేశీయంగా ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీకి జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఇంజిన్లను భారత వాయుసేనకు చెందిన తేజస్ మార్క్-2 యుద్ధ విమానాల్లో అమరుస్తారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటన వేళ ఈ నిర్ణయం వెలువడింది. జీఈ ఏరోస్పేస్‌కు చెందిన F414 ఇంజిన్లను హెచ్‌ఏఎల్‌తో కలిసి భారత్‌లో తయారు చేసేందుకు ఒప్పందం కుదిరిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నుంచి కావాల్సిన ఎగుమతి అనుమతులను తీసుకోనున్నట్లు పేర్కొంది. హెచ్‌ఏఎల్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని భారత్-అమెరికా మధ్య రక్షణ భాగస్వామ్యంలో కీలక ముందడుగుగా అభివర్ణించింది. దీన్నోక చారిత్రక ఒప్పందంగా జీఈ ఏరోస్పేస్ ఛైర్మన్, సీఈఓ లారెన్స్ కల్ప్ జూనియర్ పేర్కొన్నారు. గగనతల పోరాటంలో ఫైటర్ యుద్ధవిమానాలే రారాజులు. వాటికి గుండెకాయ లాంటిది అందులోని జెట్ ఇంజిన్. జెట్ ఇంజిన్ల తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యాల వద్ద మాత్రమే ఉంది. దాన్ని ఇతర దేశాలకు బదలాయించడానికి అవి అంగీకరించడం లేదు. రక్షణ పరిజ్ఞానానికి సంబంధించి ఇప్పటివరకూ అనేక అంశాల్లో భారత్ స్వయంసమృద్ధి సాధించినప్పటికీ.. జెట్ ఇంజిన్ విషయంలో మాత్రం పురోగతి లేదు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానం కోసం 'కావేరి' ఇంజిన్ ప్రాజెక్టును 1986లో ప్రారంభించింది. ఇందుకు రూ.వేల కోట్లు వెచ్చించినా ఆ ఇంజిన్ ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. దీంతో తేజస్ యుద్ధవిమానాల కోసం జనరల్ ఎలక్ట్రిక్ నుంచి జీఈ-ఎఫ్404 ఇంజిన్లను దిగుమతి చేసుకుంది. ఇప్పటికే 75 ఎఫ్404 ఇంజిన్లు దేశానికి చేరాయి. మరో 99 ఇంజిన్లు రావాల్సి ఉంది. మరోవైపు 8 F414 ఇంజిన్లు భారత్‌కు చేరాయి. తాజా ఒప్పందం ప్రకారం.. ఇకపై వీటిని దేశీయంగా తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌లో భారీగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇంజిన్ల తయారీకి సంబంధించిన పరిజ్ఞానమూ భారత్‌కు బదిలీ చేసే అవుతుంది.
భారత్‌లోనే ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ !
June 22, 2023
0
Tags