ఢిల్లీ నుంచి బయల్దేరి సాంకేతిక లోపం కారణంగా రష్యాలో దిగిన ఎయిరిండియా విమాన ప్రయాణికులు ఎట్టకేలకు అమెరికా బయల్దేరారు. దాదాపు 39 గంటల తర్వాత ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. గురువారం ఉదయం ఆ ప్రయాణికులను తీసుకుని శాన్‌ఫ్రాన్సిస్కోకు టేకాఫ్ అయ్యింది. ఈ విషయాన్ని ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా AI173 విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది రష్యాలో అత్యవసరంగా దిగిన విషయం తెలిసిందే. జూన్ 6వ (మంగళవారం) తేదీన ఉదయం 4.05 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించారు. మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానాన్ని మదగన్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించారు. ఈ విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఈ మగదన్ ప్రాంతం రష్యా రాజధాని మాస్కోకు 10 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో హోటళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులను డార్మిటరీల్లో ఉంచారు. అదే సమయంలో ప్రయాణికులను వీలైనంత త్వరగా అక్కడి నుంచి తరలించేందుకు ఎయిరిండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, కొన్ని అనుమతులు ఇతరత్రా కారణాల వల్ల ఈ ప్రయత్నాలు కొంత ఆలస్యమయ్యాయి. చివరకు బుధవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఎయిరిండియా ప్రత్యేక విమానం ముంబయి నుంచి మగదన్‌కు బయలుదేరింది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విమానం రష్యా చేరుకుంది. అనంతరం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రయాణికులను తీసుకుని ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరింది. అలా దాదాపు 39 గంటల నిరీక్షణ తర్వాత ఈ ప్రయాణికులు ఎట్టకేలకు తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. మగదన్‌లో నిలిచిన సమయంలో తాము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు. సరైన వసతులు లేని కారణంగా ఈ ప్రయాణికులను బస్సుల్లో పలు ప్రాంతాలకు తరలించారు. అయితే లగేజీలు విమానంలో ఉండటంతో వీరు ఇబ్బందులు పడ్డారు. ఆహారం, ఔషధాలు లేకపోవడంతో పాటు కొన్ని సమస్యలను ఎదుర్కొన్నామని తెలిపారు. రష్యాలో దిగిన ఈ విమానంపై అమెరికా స్పందించింది. పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ఈ విమానంలో 50 కంటే తక్కువ మందే అమెరికా పౌరులు ఉన్నట్లు వెల్లడించింది.
రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
June 08, 2023
0
Tags