భారతదేశ ప్రాచీన సంస్కృతి అయిన యోగాకు ఎలాంటి కాపీరైట్లు లేవని, రాయల్టీలతో సంబంధం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎవరైనా, ఏ వయసువారైనా, ఎక్కడైనా యోగాను ఆచరించవచ్చని స్పష్టం చేశారు. అసలైన విశ్వవ్యాప్త కసరత్తు యోగా అని మోడీ పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన చారిత్రక యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ఐరాస ప్రతినిధులు, ప్రముఖులు, సాధారణ ప్రజలతో కలిసి యోగా చేశారు. అంతకుముందు, ఐక్యరాజ్య సమితి కార్యాలయంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ, అక్కడికి విచ్చేసినవారిని ఉద్దేశించి ప్రసంగించారు. 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలని భారత్ గతేడాది చేసిన ప్రతిపాదనకు ప్రపంచదేశాలన్నీ మద్దతు తెలిపిన విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు. యోగా కోసం మరోసారి ప్రపంచం ఏకం కావడం చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. కాగా, మోడీ నేతృత్వం వహించిన ఈ యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అత్యధిక దేశస్థులు పాల్గొన్న యోగా కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని గిన్నిస్ ప్రతినిధులు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమానికి 140 దేశాలకు చెందిన ప్రజలు రావాల్సి ఉండగా 135 దేశాలకు చెందినవారు వచ్చారని గిన్నిస్ రికార్డుల సంస్థ ప్రతినిధి మైఖెల్ ఎంప్రిక్ తెలిపారు. ఇది ప్రపంచ రికార్డని చెప్పారు. దౌత్యవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు సహా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు యోగా డేలో భాగమైనట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఐరాస ప్రధాన కార్యాలయానికి ప్రజలు పోటెత్తారని పేర్కొన్నారు. ఐరాస 69వ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సమయంలో ప్రధాని మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదన చేశారు. భారత్ 2014లో చేసిన ప్రతిపాదనకు ప్రపంచదేశాల నుంచి అనూహ్య మద్దతు లభించింది. 175 ఐరాస సభ్యదేశాలు భారత్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. దీంతో ఏటా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానిస్తూ 2014 డిసెంబర్లో ప్రకటన చేసింది.
ఎవరైనా, ఏ వయసువారైనా, ఎక్కడైనా యోగాను ఆచరించవచ్చు !
June 21, 2023
0
Tags