ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో నాలుగో రోజు ఆశలు రేపిన టీమిండియా ఐదో రోజు కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ఐ దో రోజు తొలి సెషన్ లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. ఫలితంగా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ విజేతగా అవతరించింది. విరాట్ కోహ్లీ (78 బంతుల్లో 49; 7 ఫోర్లు), అజింక్యా రహానే (108 బంతుల్లో 46; 7 ఫోర్లు, రోహిత్ శర్మ (60 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. నాథన్ లయన్ 4 వికెట్లతో మెరిశాడు. బొలాండ్ కు మూడు వికెట్లు లభించాయి. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు సాధించాడు. ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్లకు 164 పరుగులతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను స్కాట్ బొలాండ్ తొలి దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా (0) వికెట్లను తీశాడు. ఆ తర్వాత కాసేపు రహానే, కేెెఎస్ భరత్ (23) కాసేపు ప్రతిఘటించాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన స్టార్క్ రహానేను అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ హీరో శార్దుల్ ఠాకూర్ (0)ను నాథన్ లయన్ ఎల్బీ చేశాడు. కాసేపటికే ఉమేశ్ యాదవ్ కూడా అవుటయ్యాడు. లేని షాట్ కు వెళ్లిన కేఎస్ భరత్ కూడా లయన్ చేతికే చిక్కాడు. సిరాజ్ చివరి వికెట్ గా వెనుదిరిగాడు. భారత్ తన చివరి 7 వికెట్లను 55 పరుగుల తేడాలో కోల్పోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 121.3 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో ఆసీస్ నడ్డి విరిచాడు. షమీ, శార్దుల్ ఠాకూర్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ (174 బంతుల్లో 163; 25 ఫోర్లు, 1 సిక్స్), స్టీవ్ స్మిత్ (268 బంతుల్లో 121; 19 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. అలెక్స్ క్యారీ (48), డేవిడ్ వార్నర్ (43) ఫర్వాలేదనిపించారు. రెండో ఇన్నింగ్స్ ను 84.3 ఓవర్లలో 8 వికెట్లకు 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. దాంతో భారత్ ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 69.4 ఓవర్లలో 296 పరుగులు చేసి టీమిండియా ఆలౌటైంది. అజింక్యా రహానే (129 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ (109 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. రవీంద్ర జడేజా (48) ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీశాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్ గా ఆస్ట్రేలియా
June 11, 2023
0
Tags