బొగ్గు గనిలో గల్లంతైన భర్త కోసం రెండు నెలలుగా భార్య పోరాటం !

Telugu Lo Computer
0


అసోంలోని తిన్​సుకియా జిల్లాలోని షుకాని గ్రామానికి చెందిన ఊర్వశి మోరన్, ప్రాంజల్ మోరన్ భార్య,భర్తలు. జనవరి 12న లిడులోని మైనింగ్​ మాఫియా చేపట్టిన బొగ్గు తవ్వకాలలో ప్రాంజల్ పనిచేస్తు గల్లంతయ్యాడు. అతడి జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో మార్చి 4న కుటుంబ సభ్యులు లిడు పోలీసులను ఆశ్రయించారు. కానీ మాఫియా గ్యాంగ్​ ఒత్తిడితో వాళ్ల ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు.  మైనింగ్​ మాఫియా గ్యాంగ్​ ఊర్వశికి సైతం రూ.5 లక్షలు ఇవ్వజూపింది. కానీ ఊర్వశి ఆ డబ్బును తీసుకోలేదు. తనకు తన భర్త కావాలని డిమాండ్​ చేసింది. స్థానిక పోలీసులు ఎంతకీ స్పందించకపోవడం వల్ల.. 650 కిలోమీటర్ల దూరమున్న గుహవటికి వెళ్లాలని నిర్ణయించుకుంది ఊర్వశి. వెంటనే తన బిడ్డను చంకనెత్తుకుని గుహవటికి చేరుకుంది. రాష్ట్ర డీఐజీ జీపీ సింగ్​ను తన కార్యాలయంలో కలిసింది. ఘటన మొత్తాన్ని ఆయనకు వివరించింది. ఎలాగైన తన భర్తను వెతకాలని ప్రాధేయపడింది. దీనిపై స్పందించిన డీఐజీ ఊర్వశి భర్త ప్రాంజల్​ను వెతికిపెడతామని ఆమెకు హామీ ఇచ్చారు. దక్షిణ అసోం ఇన్‌ఛార్జ్ ఐజీపీ జిత్మల్ డేల్‌కు దర్యాప్తు బాధ్యతను అప్పగించారు. ప్రాంజల్​ తప్పిపోయిన బొగ్గుగని ప్రాంతానికి.. సోమవారం తన టీంతో వెళ్లాడు ఐజీపీ జిత్మల్ డేల్‌. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం బొగ్గు గనుల కింద ​కుళ్లిపోయిన స్థితిలో ప్రాంజల్​ మృతదేహాన్ని గుర్తించారు. భర్త చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రాంజల్​ భార్య, అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)